అజిత్‌ పవార్‌ రమ్మంటే వెళ్లాం..మాకేం తెలీదు

అజిత్‌ పవార్‌ రమ్మంటే వెళ్లాం..మాకేం తెలీదు


ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా చోటుచేసుకుంటోంది. ముంబయిలో జరుగుతున్న పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్సీపీ చీలిక వర్గం (అజిత్ పవార్‌)తో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడం.. ఫడణవీస్‌ సీఎంగా, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం.. వంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి.  అయితే, అజిత్‌ పవార్‌ వైపు వెళ్లిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు (సందీప్‌ క్షీరసాగర్‌, సునిల్‌ భుసారా, రాజేంద్ర సింఘానే) తిరిగి ఎన్సీపీ గూటికే చేరారు. అజిత్‌ పవార్‌ తమకు ఫోన్‌ చేసి రాజ్‌భవన్‌కు రమ్మంటేనే వెళ్లామనీ.. అంతకుమించి తమకేమీ తెలియదని వారు అంటున్నారు. అజిత్‌ పవార్‌ ఫోన్‌ చేసి తనను రమ్మన్నారనీ.. రాజ్‌భవన్‌ వద్ద ఏం జరుగుతుందో అర్థం చేసుకొనే లోపే ప్రమాణస్వీకారం పూర్తయిపోయిందని రాజేంద్ర సింఘానే మీడియాకు తెలిపారు. ఆ తర్వాత శరద్‌ పవార్‌ వద్దకు వచ్చామన్నారు. శరద్‌ పవార్‌తోనే ఉంటామని చెప్పామన్నారు.ఈ పరిణామల తర్వాత ఎన్సీపీ- శివసేన సంయుక్తంగా  మీడియా సమావేశం నిర్వహించాయి. భాజపాకు తగిన సంఖ్యాబలం లేదని.. అసెంబ్లీలో జరగబోయే బల పరీక్షలో ఆ పార్టీ నెగ్గలేదంటూ శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించగా.. ఈ చర్య మహారాష్ట్రపై జరిగిన రాజకీయ సర్జికల్‌ స్ట్రైక్స్‌గా శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు. శివసేన - ఎన్సీసీ -కాంగ్రెస్‌ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దాదాపు అన్ని ప్రయత్నాలూ చేసుకున్నాయి. ఉద్ధవ్‌ను సీఎంగా ఉంచాలని కాంగ్రెస్‌ - ఎన్సీపీ నిర్ణయించాయని శరద్‌ పవార్‌ వెల్లడించిన గంటల్లోనే రాత్రికి రాత్రే మహారాష్ట్రలో మారిన రాజకీయం సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది